- అమెరికా ప్రజలు సార్వత్రిక వయోజన ఓటు హక్కు కోసం రెండు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ, భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుండే కుల, మత, ప్రాంత, లింగ భేదాలతో నిమిత్తం లేకుండా వయోజనులకు ఓటు హక్కు వచ్చింది. ఆధునిక తెలుగు కవులు ఆ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించారు. యోగ్యులయిన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని తమ కవిత్వం ద్వారా సమాజాన్ని చైతన్యం చేశారు.
- ఓటు చైతన్యం మీద కవిత్వం రాసిన వారిలో ముందుగా జాషువాను చెప్పుకోవాలి. ఓటు అనే పేరుతో ఆయన 60 దశకంలో తొమ్మిది పద్యాలతో కూడిన ఖండికను రాశాడు.
- ఉ. కూటికి గుడ్డకున్ ప్రజలు, కొంగరవోవుచుండ నీటుగా
- మోటారూబండ్లపై నగదు మూటలతో కలవారి వోటు భి
- క్షాటన సాగుచున్నయది జాగ్రత! దేశనివాసులారా! మీ
- యోటులు స్వీయభారత సముజ్వల గాత్రికి సూత్ర బంధముల్ అంటే, ఆనాటికే ఓటుకు డబ్బు పంచే దుస్థితికి మన ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజారిందని అర్థం. ఓట్ల కోసం మోటారు బండ్లపై నగదు మూటలతో తిరిగే స్థితి ఏర్పడినా, ప్రజలు వివేకంతో ఓటు వేస్తే అలాంటి ఓట్లు ‘స్వీయ భారత సముజ్వలగాత్రికి సూత్రబంధముల్’ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు జాషువామ. ఒక పర్యాయము చేయి జారితిరి మీ వోటుల్ దగా దేశనా యకులన్నమ్మి, సమస్త కష్టములపాలై దేశ మల్లాడె, వాలకముల్ మారిచి వారు, వారి హితులున్ లాలింపగా వత్తురిండ్లకు బండ్లెక్కి, ప్రజాహితార్థులవలెన్ ద్రవ్యంబు మ్రోగించుచున పొరపాటున ఒకసారి చేయి జారి అయోగ్యులకు ఓటు వేస్తే దగాకోరు నాయకులు అధికారంలోకి వచ్చి, దేశాన్ని సమస్త కష్టాలకు గురిచేస్తారని మరీ హెచ్చరించాడు.
- వయసులో జాషువా కంటే 20 యేళ్ళు చిన్నవాడయిన కాళోజి ఇంకా ముందుగానే ఓటు గురించి రాశాడు. పోలీస్ యాక్షన్ తర్వాత 1949లో స్టేట్ కాంగ్రెస్‌కు జరిగిన సంస్థాగత ఎన్నికల సందర్భంగా రాసిన గేయాన్ని చూద్దాం.
- ఓటిచ్చు అధికార మున్నట్టివారు/ ఎన్నికల సమయాన తిన్నగా వినుడు/ మట్టి బానలుకొనిన కొట్టి చూచెదము/ సరుకుకొన వీధెల్ల తిరిగి చూచెదము/ పండు పండెనో లేదో పట్టి చూచెదము/ ఓటు వేయుట పిల్లలాట ఎట్లగును?/ అభ్యర్థులై ఓటులడిగేటివారు/ ఏమేమి జేసిరో ఎటువంటి వారో?/ పురుషులెవ్వారు కాపు పురుషులెవ్వారు/ గుర్తించి ఓటులను గురిపింపవలయు/ ఓటిచ్చునప్పుడే ఉండాలె బుద్ది/ ఎన్నుకొని తలబాదుకొన్న నేమగును?/ తర్వాత ఏడ్చినా తప్పదనుభవము.
- మట్టి కుండను కొనేటపుడు కూడా దానిని చేతితో కొట్టి పరీక్షగా చూస్తాము. మార్కెట్లో ఏ వస్తువును కొన్నా పది రకాలుగా ఆలోచిస్తాము. అలాంటిది మన జీవితాన్ని నిర్దేశించే పాలకులను ఎన్నుకునే సందర్భంలో ఎంత జాగ్రతగా నిర్ణయం తీసుకోవాలో కవి సూచిస్తున్నాడు.
- ఓ ఓటరు కాపన్నా !/ ఎద్దుల తప్పేమీ లేదు
- కాడి పెట్టుకున్నందుకే/ మురిసిపోయి దేబెవోలె
- ఓట్లు మేపి పంటమాట/ మరచి నీవు పస్తుంటివి
- బలసిరేగి కాడెద్దులు/ జంట వీడకుండ మేసి
- రంకలేస్తూ తిరుగుచుండె/ మూడు సార్లు ఓట్లేసి
- స్వర్గానికి ఉట్టి కట్టి/ లొటకలేస్తూ చస్తుంటివి
- అయ్యో ఖర్మం అంటూ/ నెత్తంతా బాదుకుంటూ.
- రైతుకు తన కాడెద్దులను సరిగా ఉపయోగించుకోవడం తెలియాలి. మేత బాగా వేసి పని నేర్పకుంటే అవి రంకెలేస్తూ ఖాళీగా తిరుగుతాయి. గెలిచి పనిచేయకుండా తిరిగే నాయకులను అలాంటి ఎద్దులతో, ఓట్లను మేతతో పోల్చాడు కవి.
- అలాగే, కాళోజీ 1967లో ‘తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!!’ అనే శీర్షికతో రాసిన –
- ‘అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు/ ఏ పాటి వాడో చూడు ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు/ ఇందాక ఏం చేసిండో చూడు ఇప్పుడు కట్టే ముడుపులు కాదు/ ఇందాక చెల్లించింది చూడు పెట్టుకునే టోపీ కాదు/ పెట్టిన టోపీ చూడు’అంటూ హెచ్చరికలు చేసిన కవిత తెలుగు కవిత్వ ప్రేమికులకు సుపరిచితమే.
- ఆరుద్ర తన ‘కూనలమ్మ పదాల’లో ‘బ్రూటున కేసిన ఓటు/ బురదలో గిరవాటు/ కడకు తెచ్చును చేటు/ ఓ కూనలమ్మ’ అని హెచ్చరించాడు. బ్రూటు అంటే క్రూరమైనవాడు అని అర్థం. రౌడీలు, గూండాలు రాజకీయాల్లోకి వస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి గెలవడం, గెలిచాక అంతకు పదిరెట్లు దోచుకోవడం ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రం. అందుకే అలాంటి ‘బ్రూటు’లకు ఓటు వేయొద్దని, వేస్తే అది ప్రమాదంగా పరిణమిస్తుందని ఆరుద్ర హెచ్చరిస్తున్నాడు.
- తెలుగులో మినీ కవిత్వాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన వారిలో ముఖ్యుడైన రావి రంగారావు కూడా ఓటు హక్కు వినియోగం మీద చాలా రాశాడు.
- నమ్మకమ్ము నిలుపు నాయకులున్నచో/ ఓటు నమ్ముకోరు నోటు కొరకు/ పాయసమ్ము వంటిది ప్రజాస్వామ్యమందు/ గుండుసూదులు ప్రజలమ్ముకొన్న ఓట్లు/ దినము దినముకు ఓట్లమ్ముకుడెడివారు/ పెరుగుచుండగ అవినీతి పెరుగుచుండె పైన పేర్కొన్నవి రావి రంగారావు ఓటు మీద రాసిన కొన్ని పద్యపాదాలు. అనేక మినీ కవితలు కూడా రాశాడు. మచ్చుకు కొన్ని.
- ఓటు/ నోటు/
- వాటేసుకుంటే
- పుట్టేది/ రాక్షస బిడ్డే
- వినాయకుడి లాంటి ఓటర్లను
- ఎంతో విలువైన దేవుళ్ళను
- ఆర్భాటమైన భక్తితో
- నైవేద్యాలు పెట్టీ పెట్టీ
- పండగ రోజులు పొగానే
- హుస్సేన్ సాగర్‌లో ముంచుతారు
- నీ చేతిలో ఓటు
- జాగ్రత్తగా వాడితే
- పొలం దున్నే హలం
- కళ్ళు మూసుకొని వేస్తే
- భవిష్యత్తును బలిగొనే
- విషపూరిత కరవాలం!
- తెలుగునాట పాట అంటే ముందుగా గుర్తొచ్చే పేరు గద్దర్. చాలా కాలం పాటు గద్దర్ విప్లవోద్యమంతో ఉన్నాడు. బయటికి వచ్చాక ఆయన ఓటు హక్కు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకొని 2018లో ఓటు హక్కును పొందాడు. అదే సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటుపై పాటలు కూడా రాశాడు.
- రాజకీయ బానిసలారా…. ఈ రాజీ బ్రతుకులు వద్దురా
- ఒకే మనిషికొక ఓటురా…. నోటుకు బలిపెట్టొద్దుర
- వెల కట్టలేనిదీ ఓటురా…. నీ బ్రతుకును మార్చే తూటరా
- ఇది బాటరా…. బాబా సాహెబ్ మాటరా
- ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ‘ఓటేడ నేనెస్తిరన్న…. నా ఓటు, దానోటు నా పెండ్లామే గుద్దే ….ఓటేడ నేనేస్తిరన్న’ అనే అద్భుతమైన పాటను రాశాడు. ఇట్లా ఎందరో తెలుగు కవులు ఓటు హక్కు ప్రాధాన్యతను తెలుపుతూ రాశారు. సామాజిక బాధ్యతతో అలాంటి కవిత్వాన్ని నిలబెడుతున్న కవులకు నమస్కారం.