- Kalvakuntla Kavitha Custody: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఊహించని మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉండగా.. ఈరోజు చివరి రోజు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని కవిత, ఆమె భర్తకు సంబంధించిన బంధువుల ఇళ్లలో ఈడీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో ఉదయం నుంచే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం.. సర్వత్రా ఉత్కంఠగా మారింది.
- Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈరోజు కవితది కస్టడీ చివరి రోజు కాగా.. హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు మొదలుపెట్టింది. కవిత బంధువుల ఇళ్లతో పాటు.. ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే అఖిల నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున మనీ ల్యాండ్రింగ్ జరిగిందని భావిస్తున్న ఈడీ.. కవితకు చాలా క్లోజ్‌గా ఉన్న ఆమె ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అఖిలకు సంబంధించి 3 సంవత్సరాల ఆర్థిక లావా దేవిలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అఖిలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లు, ట్రాన్సాక్షన్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, బంగారం వివరాలను తనిఖీ చేస్తున్నారు అధికారులు. ఈడి అధికారులతో పాటు మదాపూర్ పోలీసులు కూడా అఖిల ఇంటికి చేరుకున్నారు. మాదాపూర్‌లోని డీఎస్ఆర్ రేగంటి అపార్ట్‌మెంట్‌లోని మూడో ఫ్లోర్‌లో ఉంటున్న అఖిల కుటుంబం.. ఈడి అధికారులు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో.. వారి ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
- మార్చి 15న హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ముమ్ముర సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ లావాదేవీలు, ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. విచారణకు రావాలని కూడా నోటీసులివ్వగా.. ఆయన వెళ్లలేదు. అయితే.. ఇప్పుడు కవిత కస్టడీ చివరి రోజున ఇలా.. తమ బంధువుల ఇళ్లలో ముమ్మర తనిఖీలు చేయటం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
- అయితే.. కవిత నుంచి ఇప్పటికే సుమారు 16 మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె భర్త అనిల్‌తో పాటు పీఆర్వో రాజేష్, ముగ్గురు అసిస్టెంట్ల ఫోన్లను కూడా అధికారులు సీజ్ చేశారు. కాగా.. కస్టడీ రిపోర్టులోనూ సంచలన విషయాలు వెల్లడించింది ఈడీ. కాగా.. ఈరోజు కస్టడీ ముగుస్తుండటంతో.. మధ్యాహ్నం 12 రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చాల్సి ఉండగా.. కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందన్నది ఉత్కంఠగా మారింది.